CHRIST LIFE REVIVAL — నా జీవిత సాక్ష్యం
పోస్టర్ 1-D
నా భార్య — మా అమ్మగారికి ఒక కూతురిలా చేసిన సేవ
నా జీవితంలోకి వచ్చిన నా భార్య కేవలం నాకు జీవిత భాగస్వామిగా మాత్రమే ఉండిపోలేదు. మా అమ్మగారికి ఒక కూతురిలా మారింది. అలా అమ్మకు తన కొడుకు రూపంలో కూతురు లేని లోటు తీరింది అని నేను అనుకుంటున్నది అదే నిజం.
మా అమ్మగారిని కేవలం అత్తగారిగా చూడలేదు. కన్నకూతురిలా చూసుకుంది.
స్నానం చేయించింది. మలవిసర్జన తర్వాత శుభ్రం చేసింది. కొన్ని సార్లు మా అమ్మగారికి తెలియకుండా మలవిసర్జన జరిగి కింద పడిపోయినప్పుడు కూడా అసహ్యించుకోకుండా శుభ్రం చేసింది.
మా అమ్మగారికి అవసరమైన సేవ చేసింది. ఆమె బలహీనతలను అర్థం చేసుకుంది. వృద్ధాప్యంలో, అనారోగ్యంలో ఉన్న ఒక తల్లికి అవసరమైన ఆదరణను అందించింది.
మా అమ్మగారి చివరి శ్వాస వరకు నా భార్య తన వంతుగా చేసిన సేవను నేను ఎప్పటికీ మరచిపోలేను. మా అమ్మగారి అనారోగ్య ప్రయాణంలో నేను మాటలతో లేను. నా భార్య కూడా ఆ బాధ్యతలో పాలుపంచుకుంది.
ఈ సేవను నేను నా జీవితంలో పొందిన గొప్ప మేలుగా భావిస్తున్నాను.
గోవా వెళ్లమనుకున్నాం — అమ్మను ఒంటరిగా వదిలేయలేకపోయాం
వివాహానికి ముందు నా భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పేవాడిని.
“మన పెళ్లి అయిన తర్వాత గోవా వెళ్దాం. మంచి ప్రదేశాలన్నీ కలిసి తిరుగుదాం.” అని చెప్పేవాడిని.
కానీ వివాహం తర్వాత ఆ కోరిక నెరవేరలేదు. ఎందుకంటే మా అమ్మగారిని ఒంటరిగా వదిలి వెళ్లే పరిస్థితి లేదు. ఆమెకు నిరంతరం సంరక్షణ అవసరం. ఆ బాధ్యతను వదిలి మేమిద్దరం సరదాగా ప్రయాణాలు చేయలేకపోయాము.
2017 ఆగస్టు నుండి 2024 ఏప్రిల్ 22 వరకు మా అమ్మగారి సేవకే ప్రాధాన్యత ఇచ్చాం.
ఆ సంవత్సరాలలో నా భార్య ఆ ప్రయాణం గురించి పట్టుబట్టకుండా పరిస్థితులను అర్థం చేసుకుని ఓర్చుకుంది. వివాహానికి ముందు చెప్పిన గోవా ప్రయాణం నెరవేరకపోయినా మా అమ్మగారి సేవలో నాకు తోడుగా నిలిచింది.
తన కోరికలను పక్కనపెట్టి కుటుంబ బాధ్యతను పంచుకుంది. ఆ సహాయాన్ని నేను మరచిపోలేను.
నా ప్రార్థన
అన్ని కుటుంబాలతో పాటు నా కుటుంబం కూడా తండ్రీ — ఒక కుటుంబం స్వర్గం ఎలా ఉండాలి అని సృష్టికి పూర్వం నీ మనసులో తలంచి మమ్మల్ని సృష్టించావో అలా ఉండాలి తండ్రీ. ప్లీజ్ మా కుటుంబాలు వైపు నువ్వు చూసినప్పుడు సంతోషించాలి. కుటుంబాలు కుటుంబాలుగా నీ వద్దకు నిర్దోషులుగా రావాలి తండ్రీ...
బైబిల్ వాక్య సూచనలు: కీర్తనలు 127:1 | ఎఫెసీయులకు 5:25–33 | కొలొస్సయులకు 3:12–14 | 1 పేతురు 3:7
పోస్టర్ 1-E
అమ్మగారి హృదయంలోని ఆందోళన — నా తర్వాత నీ పరిస్థితి ఏమిటి?
మా అమ్మగారు జీవించి ఉన్నప్పుడు తరచుగా నా భవిష్యత్తు గురించి బాధపడేవారు.
ఎన్నో సంవత్సరాలుగా నేను ఉద్యోగ జీవితాన్ని పక్కనపెట్టి ఆమెను చూసుకుంటున్నాననే విషయం ఆమెకు తెలుసు.
ఆమెకు వచ్చే పెన్షన్‌తో మా అవసరాలను చూసుకుంటున్న పరిస్థితిని గుర్తుచేసుకొని బాధపడేవారు.
“నా కోసం నీ ఉద్యోగాన్ని పక్కనపెట్టావు. నా పెన్షన్‌తో నన్ను చూసుకుంటున్నావు. నేను వెళ్లిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏమిటి?”
అని అడిగేవారు.
“నీవు నడిరోడ్డున పడి పరిస్థితి వస్తుందేమో! నిన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరు కదా!”
అని ఆందోళన చెందేవారు.
ఆ మాటల వెనుక ఒక తల్లి తన కుమారుడి భవిష్యత్తు గురించి పడే బాధ ఉంది. నేను కూడా ఆ పరిస్థితుల గురించి ఆలోచించేవాడిని. కానీ మేము ఒకరినొకరం ఓదార్చుకునేవాళ్లం.
“మనకు దేవుడే దిక్కు. ఆయనే మనలను చూసుకుంటాడు.”
అని చెప్పుకొని ధైర్యం పొందేవాళ్లం.
ఆమె తన భవిష్యత్తు గురించి మాత్రమే కాకుండా నా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించేది. ఆమె వెళ్లిపోయిన తర్వాత నేను ఎలా జీవిస్తాను? కుటుంబాన్ని ఎలా పోషిస్తాను? ఉద్యోగం ఎలా వస్తుంది? అనే ప్రశ్నలు ఆమె హృదయాన్ని బాధించేవి.
అప్పుడు ఆ ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానాలు లేవు.
కానీ ఒక నమ్మకం ఉంది. మనుషుల సహాయం లేకపోయినా దేవుడు మనలను విడిచిపెట్టడనే విశ్వాసం. ఆ నమ్మకంతోనే మేము ఒకరినొకరం ఆదరించుకునేవాళ్లం.
అమ్మగారు జీవించి ఉన్నప్పుడే నాతో పలుమార్లు ఒక కోరిక చెప్పేవారు:
“నేను చనిపోయిన తర్వాత నన్ను ఎక్కడికి తీసుకెళ్లవద్దు. కాకినాడలోనే నన్ను భూస్థాపితం చేయండి.”
బైబిల్ వాక్య సూచనలు: కీర్తనలు 55:22 | మత్తయి 6:25–34 | ఫిలిప్పీయులకు 4:6–7 | 1 పేతురు 5:7
CHRIST MUST LIVE IN US • OUR SELF MUST DIE
మనలో క్రీస్తు జీవించాలి • మనం చనిపోవాలి.