CHRIST LIFE REVIVAL
✦ క్రీస్తు జీవితం మాత్రమే మనలో కనపడాలి — మనం పరిపూర్ణంగా చనిపోవాలి!
ఇదే మన అనుదిన సిలువ దర్శనం కావాలి.
మన సిలువ ఎత్తుకొని, ఆయన అడుగుజాడల్లో, అనుదినము మన ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే పయనం కావాలి.
సిలువ అంటే మరణం.
అన్నింటిలో మనం మరణిస్తూ, యేసుక్రీస్తును ఇతరులకు చూపించడమే సిలువ.
✦ నా జీవిత సాక్ష్యం — భాగం 01
ఇతరుల రిజెక్షన్ నా జీవితానికి ముగింపు కాలేదు...!
నేను పుట్టినప్పటి నుండే నా ఇంటి వారి నుండే తిరస్కరింపబడ్డాను.
నేను ఇంట్లో, సమాజంలో, ప్రార్థనా మందిరాలలో, ఉద్యోగ స్థలాలలో — మనిషి జీవించి తన జీవితం ముగించే ఈ నాలుగు స్థలాల్లో నేను తిరస్కరింపబడ్డాను.
నేను తిరస్కారం, అసూయలో, అవమానంలో, నిందలో, ఎగతాళిలో, హేళనలో, కష్టంలో, బాధలలో, శ్రమలలో ఎదుగుతూ... పెరిగాను.
✦ వీటి ద్వారా యేసు రక్తం నాకు నేర్పింది ఒక్కటే:
నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి ఒక్కరిని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో ప్రేమించు, వారిని క్షమించు, వారిని ఆశీర్వదించు.
వారు కూడా యేసు చెప్పి చూపించినట్లు, యేసువలె జీవించునట్లు వారి కొరకు ప్రార్థించు.
వారి కుటుంబ సభ్యుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, వారికి ఇప్పటి వరకు ఎదురైన వారికొరకు, భవిష్యత్తులో వారికి ఎదురుకాబోయే వారికొరకు కూడా ప్రార్థించు.
✦ రిజెక్షన్లో నేను నేర్చుకున్నది:
వారు కాదు మారాల్సింది — నేనే...!
ఎందుకంటే నా జీవితం ద్వారా వారిని నేను మార్చి గెలవలేకపోయాను అనే సత్యం నాకు తెలిసింది.
✦ బైబిల్ రిఫరెన్స్
కీర్తనలు 34:18
కీర్తనలు 27:10
రోమీయులకు 8:28
లూకా 9:23
గలతీయులకు 2:20
✦ ఈ నా కథకు ముగింపు లేదు...
యేసుక్రీస్తులో మీకోసం నా అనుభవాలు అనుదినం కొనసాగుతుంది...!
నా జీవిత సాక్ష్యం — భాగం 02
నా రెండవ జన్మదినం
గత జీవితం
నా గత జీవితంలో పాపం నాపై విజయం సాధించింది.
నా శరీరం చెప్పినట్టు నేను జీవించేవాడిని.
కోపం, ద్వేషం, ఈర్ష్య, ఇతరులను చిన్నచూపు చూడడం, విమర్శ, తీర్పు, వాదించడం, నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రయత్నించడం, కంప్లైంట్ చేయడం, బ్లేమ్ చేయడం, చిరాకు, విసుగు—ఇలాంటి పాత స్వభావాల భారాన్ని మోశాను.
42 సంవత్సరాలు 26 రోజులు నేను పాపంలోనే జీవించాను.
చిన్నప్పటి నుంచే యేసుక్రీస్తులా జీవించాలని కోరుకున్నాను.
కానీ నా శక్తితో నేను మారలేకపోయాను.
2021 — నా జీవితాన్ని మార్చిన సంవత్సరం
జూన్ 11 — మా అమ్మతో కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది.
నాకు ఏమీ కాలేదు; కానీ మా అమ్మ కాలికి ఫ్రాక్చర్ అయింది.
ఆ తర్వాత నా లోపల నిరాశ, సంఘర్షణ, అంతర్యుద్ధం మొదలైంది.
ఒక దశలో నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను:
“నేను ఎందుకు బ్రతకాలి?
దేనికోసం బ్రతకాలి?
ఎవరికోసం బ్రతకాలి?
ఇన్ని సంవత్సరాలు జీవించినా మంచి జీవితాన్ని జీవించలేకపోయాను.
యేసుక్రీస్తులా జీవించాలని కోరుకున్నాను. కానీ అలా జీవించలేకపోయాను.
బహుశా నాకు క్షమాపణ లభించలేదేమో…”
2021 జూలై 4 రాత్రి ఏమి జరిగిందో నాకు తెలియదు.
2021 జూలై 5 ఉదయం
పాపభారం, భయం, పెయిన్ పోయి, గొప్ప సమాధానంతో నా జయ జీవితం ప్రారంభమైంది.
మరువలేనిది…
మాటల్లో వివరించలేనిది…
రుచి చూస్తేనే తెలిసేది…!
ఆ రోజు నేను క్రీస్తు రక్తంలో, క్రీస్తులో తిరిగి జన్మించాను.
పరిశుద్ధాత్మ అనుగ్రహించిన భాషల వరం నా ఆత్మీయ జీవితానికి గొప్ప సహాయమైంది.
మొదటిసారిగా ఆల్కహాల్ నుండి విముక్తి పొందాను.
డిసెంబర్ 29న ఖైనీ నుండి విడుదల పొందాను.
అలా రోజు రోజుకీ పాత స్వభావాలు, పాపపు బంధకాలు నుండి విడుదల పొందుతూ, ఆయనలో పెరుగుతూ ముందుకు సాగుతున్నాను.
నాకు రెండు జన్మదినాలు ఉన్నాయి
మొదటి జన్మదినం — 9 జూన్ 1979
రెండవ జన్మదినం — 5 జూలై 2021
నన్ను నేను మార్చుకోలేదు.
నా శక్తి నన్ను మార్చలేదు.
పరలోక తండ్రి పిచ్చి ప్రేమ,
యేసుక్రీస్తు రక్తం,
పరిశుద్ధాత్మ దహించు అగ్ని—
ఇవే నన్ను మార్చుతున్నాయి.
ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం ఇక కేవలం నాది మాత్రమే కాదు.
అది నాలో జీవిస్తున్న క్రీస్తు జీవితం.
2 కొరింథీయులకు 5:17
“కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను.”
CHRIST MUST LIVE IN US • OUR SELF MUST DIE
మనలో క్రీస్తు జీవించాలి • మనం పరిపూర్ణంగా చనిపోవాలి.
అను దినము నా ఆఖరి శ్వాస వరకు…!
నా జీవిత సాక్ష్యం — భాగం 03
ప్రార్థనలో మారిన నా జీవితం
2021 జూలై 5 తర్వాత, నేను భాషలతో ప్రార్థించే వరం పొందిన తరువాత నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
ఒక కొత్త ప్రార్థనా జీవితం మొదలైంది.
నేను ఊహించని అంతరంగ మార్పులు నాలో ప్రారంభమై, ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
రోజుకు 10 నుండి 12 గంటల వరకు కూడా ప్రార్థనలో గడిపిన రోజులు ఉన్నాయి.
ఒక్క మనిషి మాత్రమే కూర్చొని ప్రార్థించగలిగే చిన్న గదిలో, ఎక్కువసేపు మోకాళ్లపై ఉండి భాషలతో ప్రార్థించేవాడిని.
అలా ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దహించు అగ్నిదేవుడు నన్ను బలపరుస్తున్న అనుభూతి నాకు కలిగేది.
ఒక్కో రోజు తొమ్మిది సార్లు, ఒక్కోసారి ఆరు సార్లు, మరికొన్ని రోజులు మూడు సార్లు—అలా ఆ అనుభూతిని ఆస్వాదించేవాడిని.
నా 42½ సంవత్సరాల జీవితంలో ఎప్పుడూ అనుభవించని అనుభూతి నాలో ప్రారంభమై, ఇప్పటికీ కొనసాగుతోంది.
కొన్నిసార్లు రాత్రంతా భాషలతో ప్రార్థించేవాడిని.
2021 జూలై 5న ప్రారంభమైన ఆ ప్రార్థనా జీవితం క్రమక్రమంగా ఒక స్థిరమైన జీవన విధానంగా మారింది.
ఉదయం 3 గంటల నుండి 6 గంటల వరకు,
మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు
భాషలతో ప్రార్థించేవాడిని.
భాషలతో మాట్లాడుతూనే నా మనసులో తెలుగులో ప్రార్థించేవాడిని.
దేవుని మనసును గ్రహించడానికి ప్రయత్నించేవాడిని.
ఆ తరువాత దేవుని వాక్యాన్ని వినేవాడిని.
అలా రోజంతా దేవుని సన్నిధిలో గడపడం నా జీవితంలో ఒక భాగమైంది.
ఈ నా ప్రార్థనా జీవితం నాకు ఏమిచ్చింది?
భౌతికంగా చూస్తే—
నేను ఇహలోక ఆశీర్వాదాలతో నిండిపోలేదు.
ఆర్థికంగా కూడా ఆశీర్వదించబడిన స్థితికి వెళ్లలేదు.
కానీ ఆధ్యాత్మికంగా—
నన్ను నేను గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నాను.
నాలోని ఈ మార్పులు ఒక్క రోజులో జరగలేదు.
ఒక్కొక్కటి…
ఒకటి తర్వాత ఒకటి…
42 సంవత్సరాలుగా నాలో మారకుండా ఉన్న ఎన్నో స్వభావాలను క్రమక్రమంగా జయించడం ప్రారంభమైంది.
ఆ పని ఇప్పటికీ కొనసాగుతోంది.
పరిశుద్ధాత్మ దహించు అగ్నిదేవుని సహాయంతో జయించిన వాటిలో కొన్ని మీతో పంచుకుంటున్నాను.
నా గత జీవితంలో వీటిలో కొన్నింటిలో డిగ్రీలు, కొన్నింటిలో పీహెచ్డీలు, ఇంకొన్నింటిలో డాక్టరేట్లు చేశానని చెప్పుకోవచ్చు! 😍🤩😂🤣
ఒకప్పుడు నా జీవితం వేషధారణతో కూడినది.
హృదయంపై ఉన్న ముసుగు యేసుక్రీస్తు రక్తంలో తొలగిపోవడం ప్రారంభమైంది.
నాలో నుండి ఒక్కొక్కటిగా తొలగిపోతున్న పాత, రోత స్వభావాలు:
నా నడకను, పడకను, ప్రవర్తనను మారుస్తున్న యేసుక్రీస్తు రక్తం…
1. కోపం
2. వాదించడం
3. నన్ను నేను సమర్థించుకోవడం
4. నేను సరైనవాడినని నిరూపించుకోవడం
5. ఇతరులపై కంప్లైంట్ చేయడం
6. ఇతరులను బ్లేమ్ చేయడం
7. నన్ను నేను గొప్పగా ఊహించుకోవడం
8. అతిగా ఊహించుకోవడం
9. ఇతరులు మనకంటే తక్కువ అని భావించడం
10. ఇతరులు మాట్లాడిన మాటల ఆధారంగా వారిని విమర్శించడం
11. నేను విన్నదాని ఆధారంగా తీర్పు తీర్చడం
12. ఎవరైనా ఎదురుపడినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా ఏదైనా చెప్పినప్పుడు—వారి మాటల ఆధారంగా మనసులోనే వారిని జడ్జ్ చేయడం
13. చెడు ఆలోచనలు
14. చెడు తలంపులు
15. చిరాకు
16. విసుగు
17. ఓర్పు లేకపోవడం
18. ఇతరులను ఓర్చుకోలేకపోవడం
19. ఇతరుల నోటి మాటల ద్వారా కలిగే నొప్పి
20. నేను ముందుగా వెళ్లినప్పుడు నాకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వకుండా వేరొకరికి ఇస్తే సహించలేకపోవడం
21. నన్ను బాధపెట్టిన వారు గుర్తొచ్చినప్పుడు—బట్టలు చేతితో పిండినట్టుగా, కడుపులో ఎవరో చేతితో కెలికినట్టుగా, సూదులతో గుచ్చినట్టుగా కలిగే అంతరంగ నొప్పి
22. ఎదురు తిరగటం
23. తిరుగుబాటు చేయడం
24. అనుమానం
25. సంశయం
26. సందేహం
27. బూతులు మాట్లాడటం, నోటి మాట సరిగా లేకపోవడం
28. అతిశయం
29. నా నడక, పడక, ప్రవర్తన సరిగా లేకపోవడం
ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి.
ఇవి కేవలం మాటలతో పోవు.
క్రీస్తు చూపించిన జీవితాన్ని జీవించాలి అనే ఆసక్తి, పట్టుదల, తపన ఉండాలి.
వాటిని మనలో నుండి బయటికి పంపడానికి దేవుని పాదాల వద్ద పోరాడే గుణం ఉండాలి.
శ్రమల మార్గంలోనే అవి బయటికి వస్తాయి.
అవి బయటికి పోయేటప్పుడు పెయిన్ ఉంటుంది.
కానీ ఆ పెయిన్లోనూ నువ్వు ఓర్చుకొని నిలబడితే—
ఒక రోజు అదే పెయిన్, నీలోని పెయిన్ను తొలగిస్తుంది.
ఇన్నాళ్ల భక్తి జీవితంలో కూడా ఈ పాత స్వభావాలు పోకపోతే, దేవుని సమాధానం మనలో లేకపోతే, మన భక్తి కేవలం ఆచారంగా లేదా మూర్ఖ భక్తిగా మారిపోయిందేమో అని దేవుని పాదాల దగ్గర మనల్ని మనమే పరీక్షించుకోవాలి.
పరిశీలించుకోవాలి.
విమర్శించుకోవాలి.
ఇతరులను కాదు—మనల్ని మనమే.
నేను యేసుక్రీస్తు జీవితాన్ని నా ముందు పెట్టుకొని ప్రతి రోజూ నన్ను నేను పరీక్షించుకుంటాను, పరిశీలించుకుంటాను, విమర్శించుకుంటాను, నాకు నేనే తీర్పు తీర్చుకుంటాను.
వీటిని ఇతరులపై అప్లై చేయకుండా, నా మీదనే అప్లై చేసినప్పుడే నాలోని దుర్గంధం ఒక్కొక్కటిగా బయటికి పోతోందని గ్రహించాను.
ఈ స్వభావాలు ఒక్కొక్కటిగా నాలో నుండి Unload అవుతున్నప్పుడు, నా మీదున్న భారాలు తగ్గిపోతున్నట్టుగా అనిపించింది.
నా శరీరం గాలిలో తేలుతున్నట్టుగా ఒక తేలికను అనుభవించాను.
ఈ స్వభావాలను జయించకముందు నా ముఖంలో, నా జీవితంలో ఒక చావు కళ ఉండేది.
ఎప్పుడూ చనిపోదామా అన్న ఆలోచనలు ఉండేవి.
బ్రతుకు మీద ఆశ ఉండేది కాదు.
కానీ ఇప్పుడు—
నా హృదయంలో ఆనందం ఉంది.
నాతో ఒక్క మనిషి లేకపోయినా…
నా దగ్గర ఏమీ లేకపోయినా…
నా పరిస్థితి జీరోలో ఉన్నా…
దేవుడు నా లోపల ఇచ్చిన
సమాధానం,
శాంతి,
నెమ్మది,
నిమ్మళం,
మనసు ప్రశాంతత—
ఇవి నా జీవితంలో ఉన్నాయి.
నా ఆనందం పరిస్థితుల మీద ఆధారపడటం క్రమక్రమంగా తగ్గిపోయింది.
నా దగ్గర ఏముంది?
నాతో ఎవరు ఉన్నారు?
నా దగ్గర ఎంత డబ్బు ఉంది?
నాకు ఎంత గౌరవం ఉంది?
ఇవేవీ దేవుడు నాకు ఇచ్చిన సమాధానాన్ని తాకలేకపోతున్నాయి.
నేను నా జీవితాన్ని యేసుక్రీస్తుకు అంకితం చేసి—
ఆయనలో,
ఆయనతో,
ఆయన వెంట నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను.
నాలో మార్పు ఇంకా పూర్తికాలేదు.
ఇంకా మారవలసినది ఉంది…
ఇంకా జయించవలసినది ఉంది…
కానీ ఇప్పుడు నాకు తెలిసిన సత్యం ఒక్కటే:
నన్ను నేను మార్చుకోలేకపోయాను.
ప్రార్థనలో,
దేవుని సన్నిధిలో,
పరిశుద్ధాత్మ దహించు అగ్నిదేవుని ద్వారా మాత్రమే—
నాలోని పాత మనిషికి చెందిన పాత, రోత స్వభావాలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ,
క్రీస్తు చూపించిన జీవితం నాలో మొదలై, కొనసాగుతోంది.
దాన్ని కొనసాగిస్తున్నది కూడా పరిశుద్ధాత్మ దహించు అగ్నిదేవుడే.
అంతరంగ స్వభావాలతో పాటు, మనసులో జరిగే సంఘర్షణలు, యుద్ధాలు కూడా క్రమక్రమంగా సమసిపోతున్నాయి.
ఇదంతా మౌనంలో జరిగింది.
మాట్లాడటానికి నిదానించి,
వినడానికి వేగిరపడినప్పుడు జరిగిన మార్పులే ఇవి.
CHRIST MUST LIVE • SELF MUST DIE
క్రీస్తు జీవించాలి • నేను చనిపోవాలి
నా ఆఖరి శ్వాస వరకు…! ✝️🔥
నా జీవిత సాక్ష్యం — భాగం 04
ప్రార్థన నాకు నా నిజమైన చిరునామా చూపించింది
ఇప్పటివరకు నా ప్రయాణం…
భాగం 01:
“క్రీస్తు జీవించాలి — నేను చనిపోవాలి” అనే సత్యం నా జీవితానికి పునాది అయింది.
భాగం 02:
2021 జూలై 5న క్రీస్తులో నా రెండవ జన్మ ప్రారంభమైంది.
భాగం 03:
ప్రార్థనలో, పరిశుద్ధాత్మ కార్యంలో, 42 సంవత్సరాలుగా మారని పాత స్వభావాలు ఒక్కొక్కటిగా నాలో నుండి తొలగడం ప్రారంభమైంది.
భాగం 04:
అదే ప్రార్థన నాకు ఒక రోజు రెండు ప్రశ్నలకు సమాధానం చూపించింది:
“నేను ఎవరు?
నా అసలు చిరునామా ఏమిటి?”
ప్రార్థనలో దేవుడు నాకు నా గత జీవితాన్ని చూపించినప్పుడు, నా నిజమైన స్థితి నాకు అర్థమైంది.
నా అసలు చిరునామా ఒకప్పుడు—
చెత్తకుప్ప.
సున్నం కొట్టిన సమాధి.
చచ్చిన స్థితి.
ఎండిపోయిన స్థితి.
నిర్జీవమైన జీవితం.
చలనం లేని, చచ్చుబడిన స్థితి.
నిరుపయోగంగా, ఎవరికీ దేనికీ పనికిరానట్టుగా అనిపించిన, తృణీకరించబడిన, విసర్జించబడిన పెంట జీవితం నా జీవితం.
నాకు దొరకనివి, ఎడారిలో ఓయసిస్సులా కనిపించినవి—
ప్రేమ.
క్షమ.
ఆదరణ.
ఓదార్పు.
ధైర్యం.
గమ్యం లేని దారిలో, తృప్తి–సంతృప్తి లేని జీవిత ప్రయాణం నా ప్రయాణం…
దేనికోసం బ్రతుకుతున్నానో కూడా తెలియకుండా, “బ్రతుకుతున్నాను” అనే పేరు మాత్రమే ఉన్న జీవితం—
నిరుపయోగంగా పడివున్న నా జీవితం.
ఒక ఎడారి జీవితం.
మనుషుల తృణీకారం,
హేళన,
నిందలు,
సిగ్గు,
అవమానం,
కోపం,
ద్వేషం,
పగ,
ప్రతీకారం,
అసహ్యం,
చులకన,
తిరస్కరణ—
ఇవి నా జీవితంలో పరిచయం లేని పదాలు కావు.
వాటితో కలిసి సహజీవనం చేస్తూ సాగిన జీవిత పయనం నాది.
ఈ లోకంలో నేను లోకానుసారంగా బ్రతకడం వలన నాకు నేను తెచ్చుకున్న “బిరుదులు”—నా అప్పటి స్థితిని తెలియజేసిన మాటలు:
“పిచ్చివాడు…”
“ఎర్రిబాగులవాడు…”
“చచ్చిన కుక్కలాంటి వాడు…”
“మతితప్పినవాడు…”
“నిర్జీవుడు…”
“శవం…”
“పనికిరానివాడు…”
“పనికిమాలినవాడు…”
“చెత్తకుప్ప…”
ఇవి ఈ లోకంలో నేను లోకానుసారంగా ఉన్నప్పుడు నాకు వచ్చిన నా అసలు “బిరుదులు”.
పుట్టిన ఇంటిలోనూ,
సమాజంలోనూ,
చర్చిలలోనూ,
ఉద్యోగ స్థలాల్లోనూ—
తిరస్కరణ నాకు కొత్తది కాదు.
ఈ బిరుదుల వలన నన్ను ఈ లోకం పక్కకు నెట్టివేసి, త్రోసేసి, చెత్తకుప్పలో పడవేసినట్టు నా జీవితం నాకు అనిపించింది.
కానీ—
చెత్తకుప్పలో కన్నీటితో మొరపెడుతున్న నా కన్నును ఒక కన్ను చూసింది.
“నాలో టాలెంట్ లేదు…
క్వాలిటీ లేదు…
నేను దేనికీ పనికిరానివాడను…”
అని ఆకాశం వైపు నా కన్నులను వెడల్పు చేసి చూస్తున్న నా కన్నును ఒక కన్ను చూసింది.
అది మనిషి కన్ను కాదు.
అది నా సృష్టికర్త కన్ను.
తన పాదాల కింద ఉన్న మట్టిని, ధూళిని తన చేతుల్లోకి తీసుకొని నన్ను తయారుచేసిన ఆ చేతులే—
తిరిగి నన్ను తన చేతుల్లోకి తీసుకున్న సమయం అది.
సుమారు 30 సంవత్సరాల వయసులో—
ఆదరణ కోసం,
ప్రేమ కోసం,
ఒక అంగీకారం కోసం ఎదురు చూస్తున్న నన్ను ఆయన చూశాడు.
లోకం నా విలువను నిర్ణయిస్తున్న సమయంలో—
నేను చనిపోవాలని అనుకున్న సమయంలో—
ఆయన నన్ను చూశాడు.
నా పరిస్థితిని విన్నాడు.
నాతో మాట్లాడాడు.
స్పందించాడు.
నా భుజంపై చేయి వేసి నాతో పలికిన ఆ ఒక్క మాట—
నిరీక్షణ లేని నా జీవితంలో నిరీక్షణను కలుగజేసి, నన్ను నడిపిస్తున్న ఆ ఒక్క మాట:
“My son… నీకు నేనున్నాను.”
ఆ రోజు నుండి ఇప్పటివరకు—
17 సంవత్సరాలుగా నన్ను నడిపిస్తున్నవాడు ఆయనే.
నన్ను కనికరించినవాడు,
నన్ను ఆదరించినవాడు,
నన్ను ఓదార్చినవాడు,
నాలో ధైర్యం నింపినవాడు,
నన్ను తనలో దాచుకున్నవాడు,
నా కన్నీటిని తుడిచినవాడు—
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ — దహించు అగ్నిదేవుడు.
ఆయన ఒక Specialist
ఎందులో?
తిరస్కరించబడిన వారిని తన సారూప్యమైన యేసుక్రీస్తు సారూప్యంలోనికి మార్చడంలో సిద్ధహస్తుడు.
రోషం గలవాడు.
పౌరుషం గలవాడు.
బలమున్నవాడు.
శక్తి గలవాడు.
సమర్థత గలవాడు.
సామర్థ్యం గలవాడు.
మొండితనం గలవాడు.
పట్టుదల గలవాడు.
తపన గలవాడు.
కసి గలవాడు.
దేనిలో?
మనుషులు, ఈ లోకం—
“పనికిరాడు”
అని వదిలేసిన మనిషిని పట్టుకొని, అతని జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడంలో.
అదే—
తిరస్కరణలో,
Painలో,
హేళనలో,
నిందలో,
అవమానంలో,
సిగ్గులో,
అసహ్యంలో,
ఇతరుల కోపంలో,
పగలో,
ప్రతీకారంలో,
ద్వేషంలో,
తృణీకారంలో—
అదే చోట మనిషిని తన సారూప్యంలో మార్చడానికి ఆయన పని మొదలు పెడతాడు.
రోషంతో, పౌరుషంతో—
మౌనంగా ఉండి, మౌనంలోనే తన చేతులతో—
REJECTION నుండి PURPOSEగా
మార్చి సంతోషించే దేవుడు ఆయనే.
ఆయనకు సరిరారు.
సరిలేరు ఎవ్వరూ.
Rejectionలో, Painలో దేవుడు తన పాదాల వద్ద మనిషిని మళ్లీ తన ప్రణాళికానుసారంగా తయారుచేసి, తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు.
తిరస్కరణను అంతముగా కాకుండా—
తయారీ స్థలంగా మార్చగల దేవుడు ఆయనే.
మనిషి కోల్పోయినదాన్ని తిరిగి ఇవ్వగల సామర్థ్యం ఉన్న ఒకే ఒక్కడు—
ఆయనే మన ప్రభువు, మన ఆరాధ్యదైవమైన యేసుక్రీస్తు.
Comfort Zone నాకు నేర్పిన సత్యం
నా జీవితంలో నేను నేర్చుకున్న ఒక సత్యం:
మనిషి ఎప్పటికీ Comfort Zoneలోనే ఉంటే తన నిజమైన స్థితిని చూడటం చాలా కష్టం.
తాను ఎవరో కూడా తెలుసుకోలేడు.
ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు—పడుకున్న తరువాత కూడా—ప్రతి దానిలో సుఖాన్ని వెతుకుతాడు.
అది దొరకనప్పుడు సణుగులు, గోణుగులతో మొదలై, దానిని దక్కించుకోవడం కోసం నీతి, న్యాయం తప్పి ఇతరులను బాధపెట్టడం ప్రారంభించి—
తన జీవితంతో పాటు తన కుటుంబాన్ని కూడా నిత్య నరకంలా చేసుకుంటాడు.
Comfort మనిషిని గుడ్డివాడిగా చేసి—
ఇతరులను,
వారి బాధలను,
వారి అవసరాలను—
తృణీకరించి, వినకుండా, చూడకుండా చేస్తుంది.
“తనవారు — పరాయివారు”
అనే గోడలను నిర్మించి—
రక్తసంబంధాలను,
బంధాలను,
బాంధవ్యాలను కూడా విచ్ఛిన్నం చేస్తుంది.
మనిషి తనను తాను పరిశీలించుకోకుండా,
తనను తాను విమర్శించుకోకుండా,
తనకు తానే తీర్పు తీర్చుకోకుండా—
ఎప్పుడూ ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ, విమర్శిస్తూ—
విలువ పెట్టి కొనబడిన తన అమూల్యమైన ఆత్మను నరకకూపంలోకి నెట్టుకొని, తన కోసం ప్రాణం పెట్టిన నిజమైన దేవుని ప్రేమను, క్షమాపణను గ్రహించకుండా—
స్వర్గసీమగా ఉండవలసిన తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నరకకూపంలా మార్చుకొని, దానిలోనే నివసిస్తూ ఈ లోకం నుండి నిష్క్రమిస్తున్నాడు.
కానీ నేను—
అదే లోకంలో నుండి దేవుని పాదాల దగ్గరకు వచ్చి, సంవత్సరాలుగా మొరపెట్టింది ఇదే:
“ఓ నా సజీవమైన, నా ప్రియ పరలోకపు పరమ తండ్రీ…
నీతి, న్యాయములకు అధిపతి…
మట్టపుగుండు, న్యాయత్రాసు కలిగి, పక్షపాతం ఎరుగని కన్న తండ్రీ…
యేసయ్య అంటే నాకు పిచ్చి.
కానీ నేను అసలు మనిషిగా కూడా బ్రతకడం లేదు.
మీకు అంగీకారయోగ్యమైన, యేసయ్య చెప్పి చూపించిన జీవితం జీవించాలని ఉంది—కానీ జీవించలేకపోతున్నాను.
నిన్ను సంతోషపెట్టాలని ఉంది—కానీ సంతోషపెట్టలేకపోతున్నాను.
ఒక్క అవకాశం…
ఒక్క అవకాశం…
ఎన్ని సార్లు అడిగానో తెలియదు.
కూర్చున్నా,
లేచినా,
నిద్రలో ఉన్నా—
‘ఒక్క అవకాశం ఇవ్వు అయ్యా… మహాప్రభో…
నన్ను కన్న, కొన్న తండ్రీ…’
అని విలపిస్తూ, గోజాడుతూ, బ్రతిమాలాను సంవత్సరాలుగా.”**
పాపమనే బురదలో పందిలా ఉండలేకపోయాను.
తనకిష్టమైన గొర్రెలా బ్రతకాలని దేవుని పాదాల వద్ద పోరాడాను—పొందే వరకు.
ఆ Painలోనే—
నీవు కోరుకుంటే, దేవుడు నిన్ను తనకిష్టమైన మనిషిగా తయారుచేయడం ప్రారంభించి, క్రమంగా లోపలున్న Painను తొలగించి—
తన సమాధానం,
శాంతి,
నెమ్మది,
నిమ్మళం—
నలుదిశలా అనుగ్రహిస్తాడు.
అప్పుడు—
ఇంట్లో,
సమాజంలో,
సంఘంలో—
ఏ స్థితిలో ఉన్నా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే జీవితం ప్రారంభమవుతుంది.
నాట్యం చేస్తూ…
పరవశిస్తూ…
నోటి నిండా నవ్వుతో…
హృదయం నిండా సంతోషంతో…
పెదవులు నిండా ప్రహర్షంతో…
ముఖంపై వెలుగుతో…
ఎవరేమన్నా, ఏ స్థితి వచ్చినా—
ముఖకవళిక కూడా మారకుండా, నీ మోముపై అన్నివేళలా చిరునవ్వు ఉండేలా చేయగల సమర్థుడు, సామర్థ్యం గలవాడు—
మన యేసయ్య.
నా జీవితంలో నేను గ్రహించిన మరో విషయం
పాపం పరిహారమవకుండా ఉన్నప్పుడు మనసాక్షి మనిషిని నిందిస్తుంది.
నీ హృదయం నీపై దోషారోపణ చేస్తూ ఉంటుంది.
అప్పుడు అది నీకు మోయలేనంత భారంగా మారి, నీలో Painగా మారి, నీ సంతోషాన్ని తీసివేస్తుంది.
కానీ నీవు యేసుక్రీస్తును అంగీకరించి, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు—
అదే Painలో మనం దేవుని హృదయాన్ని వెతకడం ప్రారంభిస్తాం.
అక్కడ—
ఇతరులను నిందించడం తగ్గుతుంది.
మనల్ని మనమే పరీక్షించుకోవడం ప్రారంభిస్తాం.
మనల్ని మనమే పరిశీలించుకోవడం ప్రారంభిస్తాం.
మనల్ని మనమే తీర్పు తీర్చుకోవడం ప్రారంభిస్తాం.
అప్పుడు మన ముందుకు వచ్చే ప్రతి మనిషిని—
ప్రేమిస్తూ…
క్షమిస్తూ…
ఆశీర్వదిస్తూ…
మన చివరి శ్వాస వరకు—
యేసుతో, యేసులా నడవడం ప్రారంభించి, మన గమ్యస్థానాన్ని ప్రశాంతంగా చేరుకోవడం నేర్చుకుంటాం.
“నేను యేసును ప్రేమిస్తున్నాను” అని చెప్పడం మాత్రమే సరిపోతుందా?
చెప్పడం చాలా సులువు:
“నేను యేసును ప్రేమిస్తున్నాను.”
“నేను ఆయనను follow అవుతున్నాను.”
“నేను ఆయన శిష్యుడిని.”
కానీ కొద్దిసేపు ఆగి మనల్ని మనం అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి:
క్రీస్తులో నేను ఎక్కడ ఉన్నాను?
క్రీస్తులో నేను ఎవరు?
క్రీస్తు స్వభావం నా జీవితంలో ఎంత కనిపిస్తోంది?
నా జీవితాన్ని చూసి ఎవరైనా క్రీస్తు వైపు వస్తున్నారా?
నా వల్ల ఆయన నామానికి మహిమ వస్తుందా?
లేక నా జీవితం వల్ల ఆయన నామానికి సిగ్గు, అవమానం వస్తుందా?
నేను ఎక్కడ ఆగిపోయాను?
ఎందుకు ఆగిపోయాను?
ఎందుకు ఇంకా పరిపూర్ణత వైపు కొనసాగలేకపోతున్నాను?
ఈ ప్రశ్నలు మొదట ఇతరులకు కాదు.
మనకి మనమే వేసుకోవలసిన ప్రశ్నలు.
నా ముందున్న ఒకే Standard
దీనికి నేను కనుగొన్న సమాధానం—
బైబిల్ గ్రంథంలోని నాలుగు సువార్తలు.
మత్తయి.
మార్కు.
లూకా.
యోహాను.
యేసయ్య ఎలా నడిచాడు?
ఎలా మాట్లాడాడు?
మనుషులను ఎలా చూశాడు?
ఎలా స్పందించాడు?
ఎలా క్షమించాడు?
ఎలా ప్రేమించాడు?
ఎలా జీవించాడు?
ఆయన నడకను,
ఆయన ప్రవర్తనను,
ఆయన సంభాషణను,
ఆయన జీవితాన్ని—
పరిశీలించు.
అప్పుడు నువ్వు ఎక్కడ ఆగిపోయావో నీకే తెలుస్తుంది.
అక్కడి నుండి మళ్లీ లేచి—
నిన్ను నీవు పురికొల్పుకొని,
విదిలించుకొని,
యేసుతో తిరిగి నీ నడక ప్రారంభించు.
ఆయనలా మారుతూ—
ఆయనతో ముందుకు సాగు.
సమయం తక్కువ.
ఇది చదువుతున్న నా కుటుంబమా…
మనం ఇతరులను మార్చడానికి ముందు—
మనల్ని మనమే పరిశీలించుకుందాం.
క్రీస్తును బోధించడానికి ముందు—
క్రీస్తులా జీవిద్దాం.
క్రీస్తు పేరు చెప్పడమే కాదు—
ఆయన జీవితం మనలో కనిపించాలి.
ఇదే నా ప్రార్థన.
ఇదే నా ప్రయాణం.
నా పరిస్థితులు నీలో కనిపిస్తున్నాయా?
ధైర్యంగా ఉండు…
దేవుడు మౌనంగా నీ పరిస్థితుల వెనుక పని చేస్తూ—
నీ సాక్ష్యం రాసే పనిలో బిజీగా ఉన్నాడు.
అని అర్థం చేసుకొని-
Painలో నిలబడు… Please. 🙏
CHRIST MUST LIVE • SELF MUST DIE
క్రీస్తు జీవించాలి • నేను చనిపోవాలి
నా ఆఖరి శ్వాస వరకు…!
నా జీవిత సాక్ష్యం — భాగం 05 🙏
మనపై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు—
మనలో క్రీస్తు కనిపించాలి.
నేను ప్రార్థనలో దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయనను వేడుకుంటున్నప్పుడు, వాక్యానుసారంగా నేను గ్రహించిన సత్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన కుటుంబంతో పంచుకుంటున్నాను.
క్రైస్తవ జీవితంలో—
ఇతరులను విమర్శించడం,
తీర్పు తీర్చడం,
ఫిర్యాదు చేయడం,
నిందించడం,
కోపంతో వాదించడం,
మనల్ని మనం నిరూపించుకోవాలనే తపనతో పోరాడడం,
మనల్ని మనం సమర్థించుకోవడం—
ఇవే మన ప్రతిస్పందనగా ఉండకూడదని నేను నేర్చుకున్నాను.
మనకు వ్యతిరేకంగా ఎవరైనా లేచినప్పుడు, క్రీస్తు చెప్పి చూపించిన స్వభావమే మనలో కనిపించాలి.
ఇది చెప్పడానికి నా జీవితంలో ఒక కారణం ఉంది.
ఎంతోమంది నాకు వ్యతిరేకంగా లేచినప్పుడు, వాక్యానుసారంగా దేవుడు నాకు నేర్పినదాన్ని నేను గ్రహించాను.
అప్పుడు నా హృదయంలో నాకు వచ్చిన పిలుపు ఇదే:
“నా కుమారుడా, ప్రతికూల పరిస్థితుల్లో నన్ను చూపించు.
మౌనంగా ఉండి వారి కోసం ప్రార్థించు.”
అప్పుడు నేను ఇలా ప్రార్థించాను:
“తండ్రీ, వీరిని క్షమించు.
వీరికి సత్యాన్ని తెలియజేయి.
వీరిని ఆశీర్వదించు.
దయచేసి వీరికి ఒక్క అవకాశం ఇవ్వు.”
అలా ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన శాంతి, సమాధానం, నెమ్మది, ప్రశాంతత నాలో నిలిచాయి.
కానీ నాతో పోరాడేవారితో నేను తిరిగి పోరాడినప్పుడు, నాలోని సమాధానం దెబ్బతినడాన్ని ఒకసారి గమనించాను.
ఆ అనుభవం తర్వాత మళ్లీ ఆ మార్గాన్ని ఎంచుకోలేదు.
అందుకే—
నా మౌనమే వారికి నా సమాధానం.
నిర్గమకాండము 14:14
ఈ వాక్యం ద్వారా, క్రీస్తు జీవితం ద్వారా నేను గ్రహించిన సత్యం ఒక్కటే:
నేను మౌనంగా ఉంటే దేవుడు నా పక్షాన తను యుద్ధం చేస్తాడు.
నేను పోరాడటం మొదలు పెడితే దేవుడు మౌనంగా ఉంటాడు శత్రువు గెలుస్తాడు ఏది కావాలి నాకు అని నేను ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు నా సమాధానం నేను మౌనంగా ఉండటం.
అందుకే—
మనల్ని మనం నిరూపించుకోవాలనే తపనకు బదులుగా,
క్రీస్తు మాదిరిని అనుసరిద్దాం.
ఆయన నిందకు ప్రతినింద చేయలేదు.
బాధలో బెదిరించలేదు.
న్యాయంగా తీర్పు తీర్చే తండ్రికి
తనను తాను అప్పగించుకున్నారు.
వారు మాట్లాడారని
మనం తిరిగి మాట్లాడాల్సిన అవసరం లేదు.
మన మాటల్లో,
మన మౌనంలో,
మన ప్రవర్తనలో—
క్రీస్తు కనిపించాలి.
క్షమిస్తూ ప్రార్థిద్దాం.
ప్రతికూలతలను దేవునికి అప్పగిద్దాం.
మన సమాధానం—
క్రీస్తు స్వభావం.
మత్తయి 27:12–14
1 పేతురు 2:23
లూకా 23:34
నిర్గమకాండము 14:14
మన ఆఖరి శ్వాస వరకు—
మనలో క్రీస్తు జీవించాలి.
మన జీవితం తండ్రికి ఇంపైన సువాసనగా ఉండాలి.
CHRIST MUST LIVE • SELF MUST DIE
మనలో క్రీస్తు జీవించాలి • మనం చనిపోవాలి
మన ఆఖరి శ్వాస వరకు…! ✝️🔥
#ChristLifeRevival #MyLifeTestimony
✝️ CHRIST LIFE REVIVAL
క్రీస్తు మాత్రమే మనలో కనపడాలి - మనం పరిపూర్ణంగా చనిపోవాలి
Pray for this. Cry out to God for this.
Let the Life of Christ arise in every heart.
నా జీవిత సాక్ష్యం — భాగం 06
ఒక ఆత్మ కోసం పరిశుద్ధాత్మ దహించు అగ్ని దేవుని అలుపెరుగని పోరాటపటిమను నా కళ్లతో చూస్తూ అనుభవించాను.
✝️ అమ్మకు సేవ చేసే క్రమంలోనే — నాలో జరిగిన అంతర్యుద్ధం & ప్రారంభమైన ఆత్మీయ శుద్ధికరణ
అమ్మకు సేవ చేసే క్రమంలోనే నాలోని పాత పాప స్వభావాలు ఒక్కొక్కటిగా తొలగిపోవడం ప్రారంభమైంది.
శుద్ధి ప్రారంభమై కొనసాగుతూ ఆ ప్రయాణంలోనే జయజీవితాన్ని జీవించడం మొదలై కొనసాగుతుంది.
అందరిలాగే నేను ఉద్యోగాన్ని, సంపాదనను మాత్రమే కోరుకొని ముందుకు సాగి ఉంటే, బహుశా నా దగ్గర జీవితకాలం సుఖంగా జీవించడానికి సరిపడా డబ్బు, ఇల్లు, అన్ని సదుపాయాలు ఉండేవేమో!
కానీ అమ్మ పరిస్థితి ఏమై ఉండేది? నా ఆత్మీయ జీవితం ఏమై ఉండేది?
ఈ ప్రశ్నలకు సమాధానంగా నేను చూసిన జీవితమే నా సాక్ష్యం.
2015 నుంచి 2024 ఏప్రిల్ 22 వరకు మా అమ్మతో సాగిన నా ప్రయాణం, ఒక ఆత్మను రక్షించడానికి, మార్పు తీసుకురావడానికి, మార్చడానికి పరిశుద్ధాత్మ దహించు అగ్ని దేవుడు ఎంతగా పోరాడుతూ పనిచేస్తాడో నా జీవితం నాకు. నేర్పుతూ తెలియజేసింది దానికి నేనే నా జీవితమే సాక్ష్యం.
CHRIST MUST LIVE IN US • OUR SELF MUST DIE
మనలో క్రీస్తు జీవించాలి • మనం చనిపోవాలి.
✝️ నా జీవిత సాక్ష్యం ఇంకా కొనసాగుతుంది…